అంత హనుమ ముందుకు సాగి
వజ్రము పొదిగిన ఆసనములు,
స్ఫటికతొ మలచిన శయ్యములు,
బంగరు పీటలు, దంతపు మెరుగులు,
మణులను పొదిగిన మెత్తటి పరుపులు,
స్వర్గము తలపించి శయ్యలు,
ఎంతో విలువగు వస్తువులు నిండిన
భవనమందలి ఒక గది చూసెను 2
పూల మాలలతొ అలంకరించబడి
తెల్లని చంద్రుని కాంతితొ వెలిగెడి
ఒక చత్రము హనుమకు భవనపు
మధ్యన అతి సుందరముగ అగుపించె 3
అశోక వృక్షపు విరిసిల పూలతొ
అతి మనోహరముగ కన్పించు చున్న
అగ్నిని పోలిన కాంతితొ మెరిసెడి
పరమాసనమును మారుతి చూసెను 4
నాలుగు దిక్కుల అతి సుందరాంగులు
పన్నీటి గంధములు నిండి వుండి,
అలసట మాపెడి గుణములు నిండిన
చాముర వీచికలు వీచుచు నుండగ 5
మంచి చెర్మముతోటి చేయబడి
మేలు పూలదండలతొ అలంకరించ బడి
వెండి బంగారు కాంతులు గలిగిన
మంచి సయ్యనూ మారుతి చూసెను 6
బంగారు జరీ గల వలువలు గలిగి
అతి పొడవగు చేతులు గలిగి
ఎర్రటి రంగుగల కన్నులు గలిగిన
రావణుని హనుమ అక్కడ చూసెను 7
సింధూరారుణ కిరణ శోభలతొ
మెరుపులు గలిగిన మేఘపు చాయతొ
రకత గంధ లేపిత రావణ దేహము,
అచ్చెరువందుచు మారుతి చూసెను 8
కామ రూపమును దాల్చెడి వీరుడు
నానాలంకృత శోభిత దేహుడు
వృక్ష సహితము నిద్రలొ మునిగిన
మందర గిరి వలె రావణుడుండెను 9
యువతీ మణులకు మనోవల్లభుడు
రాక్షస వీరులకు అతి భయంకరుడు
రతి క్రీడలలొ అలసిన దేహుడు
అతి విలాసముగ పరుండి వుండెను 10
పరాక్రమములొ విక్రముడతడు
మధువు మత్తులొ సొలసిన అతడు
బంగరు శయ్యపై ఒరిగిన అతడు
నిద్రాదేవికి ఆప్తుదు ఇపుడు 11
అతని దగ్గరకు మారుతి నదచెను
బుసలు కొట్టెడి పామును చూసి
భయపడి దూరము పారి నట్టుగ
భయపడి హనుమ దూరము జరిగెను 12
పక్కనె వున్న మెట్లను చేరి
పైనకు పాకి అటు నిటు చూసి
ఎవరు లేరని నిశ్చయించుకొని
రావణుని వైపు నిశితముగ చూసెను 13
సుగంధ ద్రవ్యము నిందిన కొలనులో
మదపుటేనుగు క్రీడించి నట్లు
మణులను పొదిగిన శయ్యను చేరి
నిద్రలొ మునిగెను రావణ అసురుడు 14
బంగారు భుజకీర్తులు చెదిరి
కట్టిన బంగారు వలువలు నలిగి
దేవేంద్రుని ధ్వజ పతాకపు శోభతొ
పరుండిన రావణుడు భాసిల్లుచుండెను 15
విష్ణుచక్రపు కోతల గీతలతో
ఐరావత దంతాల గాయపు మచ్చలతో
బిగుతు కండల గుండ్రని భుజములతో
రావణ బాహుదండములు మెరయుచుండెను 16
పొడవగు చేతి వ్రేళ్ళు, బలమగు అరచేయి
సుందర హస్త రేఖలు, ధృఢమగు కణుపులు
బలిసిన భుజములు, తిరిగిన కండలు
కలిగిన బాహువులతోనతను నిద్రించుచుండెను 17
తెల్లని హంసతూలికమున విసరబడిన
ఐదు తలల ఫణిరాజు వలె
బలమగు ఏనుగు తొండము వలె
కఠినమగు గండ శిలవలె రావణుడుండెను 18
చల్లని మంచి గంధము లేపితమై
జింక రక్తము రంగుతొ మెరిసెడివై
మేటి దాసీ గణములచే మర్దితమై
నానాలంకార భూషణ సోభితమై 19
యక్ష, గంధర్వ, నాగ గణములు
దేవ, దానవ సమూహములచే
పొగడ బడు సుగంధాలంకృతమైన
రావణ భుజములు మెరయుచుండెను 20
మందర గిరి పర్వత మధ్యమున
క్రోధవశమున బుసలిడు నాగుల వలె
అతని చేతులా సుందర శయ్య పై
అతి విలాసముగా సేద తీరి వుండెను 21
రాక్షస రాజగు రావణుడు
అతి విశాలమగు వక్షముతో
బలమగు భయంకర భుజములతో
జంట శిఖరముల మందరమువలె నుండె 22
నిద్రించెడి రావణ నిశ్వాసనుండి
చూత కుసుమముల సుందర గంధము
పున్నాగ పువ్వుల మనోహర వాసన
అతిసున్నిత వకుళ పుప్పొడి తావియు 23
మేలగు ద్రాక్షల మదిరా సౌరభము
ఉడికిన అన్నపు చక్కని చాయయు
వండిన మాంసపు ముద్దల వునికియు
కలిగిన శ్వాస భవనమంతయు నింపి వేసెను 24
పత్నీ గణములు పాదము పట్టగ
సుందర చెలియలు చేతులు నొక్కగ
నిద్రన కిరీటము ప్రక్కకు ఒరగగ
రావణ దేహము సోలెను సెయ్యపై 25
ముత్యపు దండలు యెదపై చెదరగ
కుండల కాంతితో చెంపలు మెరగవ
గుండెపై రక్తపు గంధము ఆరగ
రావణ ముఖము కాంతితొ వెలిగెను 26
కంఠాభరణపు కాంచన కాంతులు
కట్టిన వస్ట్రపు తెల్లని వెలుగులు
చంద్రుని కాంతి కి మెరిసెడి లోగిలి
రావణుని క్రమ్మెను నిద్రా మోహిని 27
నిద్రకు అగ్నివలె మెరిసెది కన్నులుగలిగి
గంగలొ సేదదీరెడి గజ రాజువలె
సేద దీరెడి రాక్షస అధిపతి
గురకలు పెట్టెను కాలుని బుసవలె 28
నాలుగు దిక్కుల దివిటీ కాంతులు
మెరుపుల మధ్యన మేఘ మాలవలె
వేయి చంద్రులు వెలసిన గదివలె
మెరిసెను రావణ శయ్యా భవనము 29
దీపపు కాంతులు మెరుపులు లాగా
రాక్షస గురకలు ఉరుములు లాగా
రావన దేహము మేఘము లాగా
అచ్చెరువందుచు మారుతి చూసెను 30
ఇందు బింబ కాంతి కల వదనములు
కుండలాల మెరుపులద్దబడిన ముఖములు
వివిధాలంకార, పూదండ భూషితలు,
ఐన రావణ ఇంతులను మారుతి చూసెను 31
నృత్య రీతులతొ నిష్ణాతులు కొందరు
సంగీత వాద్య నిపుణులు కొందరు
రావణ భుజములపై వాలిన కొందరు
అతని చెంతనే నిద్రలొ జారిన కొందరు 32
గోమేధిక పుష్యరాగ మణులతొ
మెరిసెడి ఇంతుల చెవి కమ్మలు
బంగారు కాంతులతో మెరయుట
మారుతి కాంచెను అచ్చెరువంది 33
మెరిసెడి కుండలముల కాంతిలో
తిరిగెడి నారీ జనములు హనుమకు
వెలసిన చీకటి నింగిన
విరిసిన తారల వలె తోచె 34
తమకము పెరగగ ఆడిన క్రీడన
అలసిన నడుముతొ దొరికిన అదనును
ఒదలక ఒరిగిన మదనుని చెలివలె
సోలిరి గృహమున రావణ భార్యలు 35
నృత్యపు కళలో నిపుణత తొణికెడి
కాంతామణి ఇక సోలెను సెయ్యపై
సోలిన సతి తన అవయవ అమరిక
నృత్యపు భంగిమ వలెనే ఉంచెను 36
అలసిన తనువుతో వీణియ పైబడి
నిద్రలొ మునిగిన ఒక మగువ
ప్రవాహ ఉరవడికి కొట్టుకుపొయి
పడవకు తట్టిన పద్మము వలె ఉన్నది 37
మద్దుక మొక్కటి చంకన చుట్టి
అలసిన చిన్నది నిద్రలోకొరగగ
ముద్దుగ చంటి బాబును ఎత్తి
నిద్దుర జారిన తల్లిగ నగుపడె 38
అంగముల పొందిక అందముగ గలిగి నొక ఇంతి
కుంభముల సరిపోలు వక్షములు గలిగి
పతహ మను వాద్యపు కౌగిలిలొ కరిగి
చిరకాల ప్రియుని యెదలో ఒదిగినట్లుండె 39
ఒక పద్మాక్షి పిల్లన గ్రోవినొదలక
తన బిగికౌగిట పట్టినదై, చాటున
చీకటి కవ్వల పొదల మాటున
ప్రియుని కౌగిలి చేరిన యువతి వలెఉండె 40
ప్రియురాలు ప్రియుని కలిసి నట్టు
నాట్యానికి తాళము తోడైనట్టు
వీణపై తంత్ర్లులు ఇమిడినట్లు
ఒక వీణను ఆశ్రయించి నిదురించె 41
బంగరు కాంతులీను ఒడలకు ఆసరాగా
అమరిన మృదంగము తలగడ గా
మెత్తని, నున్నని ఆమె శరీరము హత్తుకొనగా
ఒక సుందరి అలసినదై నిద్రలోకొరిగెను 42
పదమమను వాయిద్యము పొదివి పట్టి
మితిమీరిన రతి క్రీడన అలసి నట్టి
సన్న నడుముగల ఒక గారాలపట్టి
మెల్లగా అటు తూలె బాగా నిదురపట్టి 43
ఢిండిమమును చేరి మరో అందాల రాసి
ఎన్నొ యుగముల పిదప ప్రియుని చేరి
బిడ్డతోడి కలసి అతని కౌగిలి చేరేన
అన్నట్టు ఒదిగి ఒక్కటై నిదుర మునిగే 44
కామము పెరిగి దరిలేక ఎవ్వరు
ఆడంబర మొకటి అనువుగా పట్టుకుని
అదియే ప్రియుడని అక్కున పొదివి చేర్చి
నిద్రలోకి జారె కలువ కన్నుల భామ 45
నేల జారిన కుండ చెదిరిన తీరుగ
వాడిన పూలచెండు చెదిరిన వరుసగ
నిద్ర కొరిగిన ఉవిద వసంత మాసమందు
వాడియు మెరిసెడి పుష్పమువలె వెలుగుచుండె 46
స్వర్ణ కుంభములు ప్రోలు తన
సున్నితమగు పాలిండ్లు చేబూని
నిద్రా దేవి ఒడిలొ బిడ్డలా ఒక యువతి
చేరి నిదురించె అతి సుందరముగ 47
కలువ కన్నుల కలిగి
ఇందువదనగు చెలియ
సఖియ వెచ్చని తొడల
మధ్యన తూలె కసిగ 48
మదిన తమకము మెదలగ సడని
కౌగిలి బిగులలొ వాద్యములె ప్రియులుగ
తలచుచు పాలిండ్లను హత్తుచు
నిదురలొ మునిగిరి ఆ భామా మణులు 49
సెయ్యలకు తల మానికమగు తల్ప మొక్కటి
అతి సుందరమగు అలంకారముల తోడి
ఒంటరై ఒక ప్రక్కగ శోభిల్లెడి దానిపై
అమిత సుందరి నొకతిని హనుమ చూసెను 50
మండోదరి ఆమె, రావణ పట్టపురాణి
వజ్రము ముత్యములు పొదివిన నగలు గలిగి
సహజ సౌందర్యముతో భవనమునకే వెలుగై
పాలరాతి శిల్ప సౌష్టవముతో భాసిల్లుచుండె 51
మండోదరి ఆమె, రావణ పట్టపురాణి
వందలుగ దాసీ జన సమూహ సేవిత యై
అతి సుందరముగా అతి సున్నితమగు శెయ్యపై
విలాసముగా నిదురించుట హనుమ చూసెను 52
ఆనందము తాండవమాడగ ఆమెను
చూసిన మారుతి మనమున తలచెను
"ఆ అందము, ఆ కనపడు దర్పము,
ఆ సేవల చందము, ఎవరో కాదీమె సీతయే" 53
ఆనందమున మారుతి చేతులు చరిచి
వాలము ముద్దిడి, ఆటలు ఆడి, పాటలు
పాడి, స్థంబము పాకి, నేలను దూకి,
తన జాతి లక్షణములని పైకి చూపెను 54
Thursday, February 8, 2007
Subscribe to:
Posts (Atom)